Sachin Pilot : జమిలి ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్నో అంశాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నా పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. జమ్ము కశ్మీర్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగిందని, ఇక్కడ బీజేపీ పూర్తిగా వెనుకబడిందని, హరియాణలో సైతం కాషాయ పార్టీది ఇదే పరిస్ధితని పేర్కొన్నారు.
ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్ధలో జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే పని కాదని, క్యాబినెట్లో ఆమోదించినంత మాత్రాన అమలు అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. వీరు గత నిర్ణయాలపై యూటర్న్ తీసుకున్న తరహాలోనే జమిలి ఎన్నికలపైనా యూటర్న్ తీసుకుంటారని అన్నారు. కాగా, జమిలి ఎన్నికల(One Nation, One Election) నిర్వహణకు లైన్ క్లియర్ అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్‌లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టింది.
Read More :
Jani Master | లడఖ్‌లో జానీ మాస్టర్.. పోక్సో కేసు నమోదు..!