న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లో సైతం ఎన్నికలు జరుగనున్నాయి. అంతర్గత విభేదాలతో మొన్నటి వరకు సతమతమైన ఆ పార్టీ.. మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సమయంలోనే ఆ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనవరి 3న మోగాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఈ పర్యటన రద్దైంది.
రాహుల్ పర్యటన వ్యక్తిగతమని, దీనిపై వస్తున్న ఊహాగానాలపై అనవసర పుకార్లు వ్యాప్తి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అయితే, రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మట్లాడుతూ.. రాహుల్ కొద్ది రోజులు విదేశీ పర్యటనకు వెళ్లారని.. బీజేపీ, మీడియా అనవసర పుకార్లు ప్రచారం చేయొద్దన్నారు. అదే సమయంలో విదేశీ పర్యటన కారణంగా మోగాలో జరగాల్సిన ర్యాలీని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.