Rahul Gandhi | సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ అప్పీల్ చేయనున్నట్లుగా సమాచారం. మోదీ ఇంటిపేరు ఉద్దేశించి చేసిన చేసిన వ్యాఖ్యలపై కోర్టు దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా.. సోమవారం విచారణకు రానున్నట్లు పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ విషయంపై రాహుల్ తరఫున న్యాయవాదిని సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.
2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. దొంగలందరూ మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారెందుకు? అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. మార్చి 23న రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఆ తర్వాతి రోజు వయనాడ్ నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో వైపు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన తర్వాత 14 రాజకీయ పార్టీలు సంయుక్తంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 5న విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది.