Rahul Gandhi : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధిక జనాభాకు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదని అన్నారు.
భారత ప్రభుత్వం బూస్టర్ డోసులను అందించడం ఎప్పుడు ప్రారంభిస్తుందని రాహుల్ బుధవారం ట్వీట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగితే డిసెంబర్ ముగిసే నాటికి కేవలం 42 శాతం జనాభాకే వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, థర్డ్‌వేవ్‌ను నివారించాలంటే డిసెంబర్ చివరి నాటికి కనీసం 60 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తికావాలని రాహుల్ పేర్కొన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 214 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కట్టడికి పలు రాష్ట్రాలు నియంత్రణ చర్యలను చేపడుతున్నాయి.