Priyanka Gandhi : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని అమేథీ (Amethi) లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ (Kishori Lal Sharama) కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అభినందనలు తెలియజేశారు. అమేథీలో కిశోరీలాల్ గెలుపు కోసం ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు.
కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అమేథీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఓటమి పాలయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆయనపై పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అటు రాహుల్‌గాంధీ అమేథీలో ఓడినా కేరళలోని వాయనాడ్‌లో గెలిచారు. తమ కంచుకోట అయిన అమేథీని తిరిగి తమ ఖాతాలో వేసుకోవడం కోసం ప్రియాంక తీవ్రంగా శ్రమించారు.
దాంతో ఆమెనే అమేథీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరింది. కానీ అందుకు ఆమె నిరాకరించింది. పార్టీ హైకమాండ్ కిషోర్లాల్ శర్మను బరిలోకి దించడంతో ఆయన గెలుపు కోసం ప్రియాంక విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. ఇవాళ్టి ఫలితాల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ కిషోర్లాల్ శర్మకు ఎక్స్ వేదికగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.
‘కిషోరి భాయ్, మొదటి నుంచి నాకు మీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. మీరు నెగ్గుతారని చెబుతూ వచ్చాను. మీకూ, ఆమేథీలోని నా సోదర సోదరీమణులకు అభినందనలు’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు.