దేశ రాజకీయాల్లో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి చర్చల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మళ్లీ మాట యుద్ధం ప్రారంభమైంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే… ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారూ… మీరూ, మీ పార్టీ చిక్కుల్లో పడకండి. ఉమ్మడి పౌరస్మృతి అంటూ ఇబ్బందుల్లో పడకండి. న్యాయ సలహాలు మీకు ఎంతో అవసరం. ఉత్తరాఖండ్లో మీరు ఓడిపోతున్నారని మీ ప్రకటన చూస్తే ఇట్టే అర్థమైపోతోంది అంటూ కపిల్ సిబాల్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
రాష్ట్రంలో గనక తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం ప్రకటించారు. ఇదే విషయంపై తీర్మానం చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌరస్మృతితో సామాజిక సామరస్యత పెరుగుతుందని, లింగ సమన్యాయం కూడా జరుగుతుందని, మహిళా సాధికారతను కూడా సాధించుకోవచ్చని సీఎం ధామీ వివరించారు.