Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మహారాష్ట్రలో మహిళలకు రక్షణ కరవైందని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని షిండే సర్కార్‌ను కాంగ్రెస్ నేత అస్లాం షేక్ నిలదీశారు. ఓవైపు లడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు ప్రభుత్వం నగదు సాయం అందిస్తుంటే మరోవైపు సీఎం సొంత జిల్లా థానేలో మహిళలపై నేరాలు ఏకంగా 57 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని, మహిళలపై నేరాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. ఇవాళ మహారాష్ట్ర మొత్తం బద్లాపూర్ ఘటనపై భగ్గుమంటోందని అన్నారు. మహిళలకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించాలని తాము కోరుతున్నామని అన్నారు. నేరం జరిగిన సంస్ధకు బీజేపీతో సంబంధం ఉందని, సంస్ధకు చెందిన ఉజ్వల్ నికం ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పోటీ చేశారని చెప్పారు. ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
సీఎం జిల్లా థానేలో క్రైమ్ రేటు పెరుగుతున్నదని, నేరాల నియంత్రణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని, ఈ విషయంలో డిప్యూటీ సీఎంలూ వెనుకడగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలపై వేధింపులు ప్రజల్లో భయాలను రేకెత్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బద్లాపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేయాలని అస్లాం షేక్ డిమాండ్ చేశారు.
Read More :
Subramanian Swamy: ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి