Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 5 : కర్ణాటక కాంగ్రెస్‌లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ, సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర, సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. అధిష్ఠానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు. అయితే, రెండున్నర ఏండ్ల తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది. ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డీకే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే, సతీశ్ జార్కిహోళి, పరమేశ్వర వంటి నేతలు వచ్చారు. దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డీకేను వ్యతిరేకిస్తున్నది. దీంతో ఈసారైనా సీఎం కావాలనే డీకే ఆశలు నెరవేరుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సిద్ధరామయ్యను తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజికవర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్‌కు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కిహోళి పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది. అధిష్ఠానంతో ఆయన చర్చలు జరుపుతు న్నారు. సిద్ధరామయ్య సైతం జార్కిహోళి వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో ఖర్గే, పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది. ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గతంలో సిద్ధరామయ్య, డీకే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటాలు పడింది. ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్‌లో సంక్షోభానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముడా కుంభకోణం, పదవీగండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులతో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతున్నది. తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. ‘వెన్నుపోటుదారులు ఎప్పుడూ ఉంటారు. అయితే, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు’ అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది.
ముడా, వాల్మీకి, ఖర్గే ట్రస్టు వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురుదాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందులోభాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, పాత ఆరోపణలను తవ్వితీయాలని నిర్ణయించారు. కొవిడ్ నిర్వహణకు సంబంధించి రూ.7,200 కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ మైఖేల్ డిసన్హ కమిషన్ ఇచ్చిన మధ్యంతరం నివేదిక, ఎస్సై నియామక అక్రమాలపై జస్టిస్ బీ వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను బయటకు తీయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తద్వారా తనపై వస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించనున్నట్టు సమాచారం.