చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు కాంగ్రెస్ హర్యానా ఇన్చార్జ్ దీపక్ బబారియా (Deepak Babaria) తెలిపారు. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం ఆయన ప్రకటించారు. ‘హర్యానా ఫలితాలు వెలువడిన మరుసటి రోజే రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్‌కు పంపించా. అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నేను ఏ పదవిపై అత్యాశతో లేను. హర్యానా ఎన్నికల ఫలితాలు ఊహించలేనివి. సుమారు 15 స్థానాల్లో బీజేపీ సూచనల మేరకు ఈవీఎంల దుర్వినియోగం జరిగింది’ అని మీడియాతో అన్నారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే అక్టోబర్ 8న వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఊహించని విజయం సాధించింది. 90 స్థానాలకు గాను 48 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 46. అయితే కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకే పరిమితమైంది.
మరోవైపు 1966లో హర్యానా ఆవిర్భవించినప్పటి నుంచి ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి విజయం సాధించలేదు. అయితే వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీ ఈ చరిత్రను తిరగరాసింది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది.