(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది. అవినీతితో కూరుకుపోయిన సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం.. రాష్ర్టాభివృద్ధిని పక్కనబెట్టింది. గడిచిన మూడేండ్ల పాలనలో ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసింది. రాష్ట్రం మొత్తం అప్పు 95,633 కోట్లకు చేరుకున్నట్లు కాగ్ తాజా నివేదికలో పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం విధించిన పరిధి 90,000 కోట్లు కాగా దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేసిందని హెచ్చరించింది. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో హిమాచల్ రాష్ట్ర ఆర్థికం దివాలా అంచుకు చేరిందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.
ఎన్నికల్లో గెలిస్తే ఖటాఖట్ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చిన సర్కారు.. ఆయా స్కీమ్స్‌ను ఒక్కొక్కటిగా అటకెక్కించింది. అంతటితో ఆగకుండా మూడేండ్ల కంటే ముందు నుంచి అమలవుతున్న 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు సబ్సిడీ పథకానికి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. ఉచిత సబ్సిడీని వదులుకోవాలంటూ ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే లబ్ధిదారుల ఏరివేతను చేపట్టింది. ఆలయ ట్రస్టులు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లకు దిగింది. ఇక, ఆదాయాన్ని పెంచుకొనేందుకు సుఖూ ప్రభుత్వం చివరకు టాయ్‌లెట్ ట్యాక్స్‌ను విధిస్తున్నది. విధానపరమైన లోపాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కంపెనీలు, పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం, ప్రభుత్వంలో పాతుకుపోయిన అవినీతి వెరసి హిమాచల్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని నిపుణులు చెప్తున్నారు.
కొత్త అప్పులు ఎక్కడా పుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించలేని దుస్థితికి సుఖూ ప్రభుత్వం దిగజారిపోయింది. దీంతో సర్కారీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని వింత నిర్ణయాన్ని తీసుకొన్నది. ఈ మేరకు గత సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్(రివైజ్డ్ పే) రెండవ సవరణ నిబంధనలు-2025 కింద రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమన్నారు. నోటిఫికేషన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. దీంతో ప్రభుత్వం భయంతో జీవోను వెనక్కి తీసుకొన్నది.
హిమాచల్‌లో 10 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరిట ఓటర్లను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీల అమలును పక్కనబెట్టింది. పైగా రాష్ర్టాభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలను, నిరుద్యోగ సమస్యను, రైతుల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యింది. తెలంగాణలో యూరియా కష్టాలతో రైతులు, ఎగ్జామ్స్లలో అవకతవకలతో యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి, రియల్ ఎస్టేట్ పతనం, కంపెనీలు, పెట్టుబడులు తరలివెళ్లిపోవడం తెలంగాణ ఆర్థికాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తూ పోతున్నది. దీంతో ‘హిమాచల్ బాటలోనే తెలంగాణ కూడా పయనిస్తున్నదా? అని సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.