న్యూఢిల్లీ : జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రకు (Bharat Nyay Yatra) విస్తృత ఏర్పాట్లు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. మణిపూర్ నుంచి ముంబై వరకూ సాగే ఈ యాత్ర రూట్ మ్యాప్, లోగోను ఖరారు చేసేందుకు యాత్ర కొనసాగే 14 రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో జనవరి 4న సమావేశం ఏర్పాటు చేసింది. జనవరి 4న భారత్ న్యాయ యాత్ర లోగోను విడుదల చేయనుండగా రూట్ మ్యాప్‌ను 8న కాంగ్రెస్ ప్రకటించనుంది. యాత్ర థీమ్ సాంగ్‌ను జనవరి 12న విడుదల చేస్తారు.
భారత్ న్యాయ్ యాత్రలో పార్టీ నేతలు కొన్ని కిలోమీటర్లు పాదయాత్రగా ముందుకు సాగనుండగా మిగిలిన యాత్ర పొడవునా వాహనాలను ఉపయోగిస్తారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా సాగుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల మద్దతును కూడగట్టేందుకు కాంగ్రెస్ భారత్ న్యాయ్ యాత్రను చేపడుతోంది.
కాగా గత ఏడాది రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాలినడకన భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 136 రోజుల పాటు 4000 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడిచారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ యువత, మహిళలు, వృత్తిదారులు, గిరిజనులు సహా పలు వర్గాల ప్రతినిధులతో మమేకమవుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read More :
Municipal Council | మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల పిడిగుద్దులు.. వీడియో