న్యూఢిల్లీ: ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పన్ను డిమాండు నోటీసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అప్పీలును ట్రిబ్యునల్ కొట్టివేసింది. రూ. 199 కోట్ల మేర ఆదాయంపై పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ ఆదాయ పన్ను శాఖ జారీచేసిన నోటీసును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ట్రిబ్యునల్లో అప్పీలు దాఖలు చేసింది.
ఆ ఆదాయం తమకు విరాళాల రూపంలో వచ్చిందని, దీన్ని పన్ను నుంచి మినహాయించాలని కాంగ్రెస్ అర్థించింది. అయితే కాంగ్రెస్ వాదనను ఐటీ ట్రిబ్యునల్ తిరస్కరించింది.
2019 సెప్టెంబర్లో పరిశీలిస్తున్న సందర్భంగా ఒక్కో దాత నుంచి రూ. 2,000కి మించి విరాళం స్వీకరించకూడదన్న నిబంధనను ఉల్లంఘిస్తూ రూ. 14.49 లక్షల నగదును కాంగ్రెస్ తీసుకున్నట్లు పన్ను మదింపు అధికారి గుర్తించారు.మొత్తం ఆదాయం రూ. 199.15 కోట్లుగా, మొత్తం ఖర్చులు రూ. 197.43 కోట్లుగా కాంగ్రెస్ తెలిపింది.