న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్ రగడపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖేరా సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అదానీ వ్యవహారంలో ప్రధాని తీరును ఎండగడుతూ నరేంద్ర గౌతం దాస్ మోదీ అంటూ వ్యాఖ్యానించారు.
జేపీసీ ఏర్పాటుకు నరేంద్ర గౌతం దాస్ మోదీకి సమస్య ఏంటని నిలదీశారు. ఆయన గౌతం దాస్ లేక దామోదర్ దాసా అని ఎద్దేవా చేశారు. మోదీ పేరులో దామోదర్ దాస్ ఉన్నప్పటికీ ఆయన పనులు గౌతం దాస్‌లా ఉన్నాయని మోదీ తండ్రి పేరును ప్రస్తావిస్తూ చమత్కరించారు. గౌతం అదానీ పేరును జోడిస్తూ నరేంద్ర గౌతం దాస్ అంటూ ప్రధానిని అభివర్ణించారు. మరోవైపు పవన్ ఖేరా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదని కాషాయ పార్టీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. సామాన్య కుటుంబం నుంచి వ్యక్తి దేశ ప్రధానిగా ఎదగడాన్ని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీలో ఇలాంటి వ్యక్తులను గాంధీ కుటుంబ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.