Congress | న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అవినీతి వ్యవహారంపై చర్చ జరగాలంటూ దాదాపు ఆరురోజులపాటు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. దీంతో మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగాయి. దీంతో అదానీపై పోరు నుంచి కాంగ్రెస్ వైదొలగడానికి గల కారణాలేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అదానీపై పోరులో కాంగ్రెస్ పార్గీలోనే విభేదాలున్నాయని ఒక వాదన వినిపిస్తుండగా.. మిత్రపక్ష పార్టీల నుంచి కూడా సహకారం లభించడం లేదని మరికొందరు అంటున్నారు. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు అధికారులకు లంచాలు ఇచ్చారన్న అభియోగంపై అదానీపై అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గత నెల 21న పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ సమావేశాలు సాగకుండా అడ్డుకున్నది.
ప్రజలకు సంబంధించిన ఎన్నో ముఖ్యాంశాలు పార్లమెంట్లో చర్చించాల్సి ఉండగా అదానీపై చర్చ కోసం సభను స్తంభింపజేయడం సబబు కాదంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు సోమవారం పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి. అదానీపై కాంగ్రెస్ జరుపుతున్న ఆందోళనలో సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొనలేదు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల పట్ల నిధుల విడుదలలో వివక్ష వంటి అంశాలపై సభలో చర్చ జరగాలని తృణమూల్ డిమాండ్ చేసింది. ఐదుగురి మృతికి కారణమైన సంభల్‌లోని షామీ జమా మసీదు ఘటనను లేవనెత్తాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు. కేవలం అదానీ అంశాన్ని పట్టుకొని వేళ్లాడటంపై కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.
పార్లమెంట్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిని పార్టీ రాజ్యసభ ఎంపీలు నిర్దేశిస్తున్నారని ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు కినుక వహించినట్టు ఓ ఆంగ్ల పత్రికలో సోమవారం ఓ వార్తా కథనం ప్రచురితమైంది. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన తామే ప్రజలకు జవాబుదారీ అని, తమ పార్టీ రాజ్యసభ సభ్యులు కాదని ఓ అరడజను మంది కాంగ్రెస్ ఎంపీలు ఆ ఆంగ్ల పత్రికతో వాపోయారట. నిజానికి దేశంలో సామాన్య ప్రజలు అదానీ అంశాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీలు భావిస్తున్నారు. అందుకే తాము పార్లమెంట్ లోపల, బయట ఎంత మొత్తుకుంటున్నా ప్రజల నుంచి స్పందన రావడం లేదని వారు భావిస్తున్నట్టు తెలిసింది. చర్చల్లో పాల్గొంటూ అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ఉన్న అవకాశాలను రాహుల్‌గాంధీ చేతులారా చేజార్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీలు అనుకుంటున్నట్టు సమాచారం.