ముంబై, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం 44 శాతం కమీషన్ తీసుకుంటున్నదని ఆరోపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలకు, అధికారులకు భారీ కమీషన్లు చెల్లించాల్సి వస్తున్నదని, దీనివల్ల ప్రభుత్వ పనుల నాణ్యత దెబ్బతింటున్నదని ఆయన ఆరోపించారు.
వడెట్టివార్ విడుదల చేసిన వీడియోలో యావత్మల్ జిల్లా కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ ఉంబ్ సార్ మాట్లాడుతూ.. ఏ పనికైనా కాంట్రాక్టు పొందాలంటే కాంట్రాక్టర్లు ముందుగా ఎమ్మెల్యేకు 10 శాతం, అధికారులకు 15 శాతం కమీషన్ ఇవ్వాలని చెప్పారు. ఈ ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత తీసుకురావాలని, అభివృద్ధి పనుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాలని విజయ్ డిమాండ్ చేశారు.