Kamakshi Bhaskarla | టాలీవుడ్ తెరపై ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కథానాయికలు, ఇప్పుడు బలమైన కథలను తమ భుజాలపై మోస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. అరుంధతి చిత్రంతో అనుష్క శెట్టి వేసిన బలమైన ముద్ర నుంచి, ఇటీవలి కాలంలో సమంత ‘మా ఇంటి బంగారం’, రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’, నివేదా థామస్ ‘35’ వంటి వైవిధ్యమైన చిత్రాల వరకు మహిళా ప్రధాన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇప్పుడు మరో ప్రతిభావంతురాలైన నటి సిద్ధమయ్యారు. ‘పొలిమేర’ చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టెర్రిఫిక్ ఆర్టిస్ట్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సంచలన చిత్రం ‘అగధ’ (Agadha) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’ అనే అత్యంత శక్తివంతమైన, విభిన్నమైన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అగధ’ టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇప్పటివరకు కామాక్షి చేసిన సినిమాలకు, పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం నటనకు మాత్రమే కాకుండా, కథలో ప్రాధాన్యమున్న యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె స్వయంగా నటించడం ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఒక మహిళా ప్రధాన కథాంశంతో వస్తున్న ఈ సినిమా కామాక్షి కెరీర్లో మైలురాయిగా నిలవడమే కాకుండా, టాలీవుడ్లో ఉమెన్ సెంట్రిక్ సినిమాల విజయ పరంపరను మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విభిన్నమైన భావోద్వేగాలను పండిస్తూ, ఒక కొత్త సినిమాటిక్ అనుభూతిని పంచడానికి సిద్ధమైన ‘అగధ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహాదేవిగా కామాక్షి భాస్కర్ల అద్భుత నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.