హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ముఖం చాటేయడంతో ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామనే హామీ నెరవేర్చకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల నుంచి నిరసన చేపట్టారు. తెలంగాణ లెక్క తమకూ 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తామని, చెరుకు తోలిన రెండు వారాల్లో డబ్బులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ రైతులకు హామీ ఇచ్చింది.
ఇప్పటికీ వాటిని నెరవేర్చకపోవడంతో చెరుకు రైతులు ఆందోళనబాటపట్టారు. ఖుషీనగర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండు వారాలుగా నిరసనకు దిగారు. ఉచిత విద్యుత్తుతో పాటు బోరుబావులు, చెరువులు, ట్యాంకులకు గ్రాంటు మంజూరు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఆందోళనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. చెరుకు క్రషింగ్ పూర్తయినా కప్తంగంజ్ చక్కెర ఫ్యాక్టరీ రూ.44 కోట్ల బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల బాధలు పట్టని సర్కారు: బీకేయూ
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ హామీని యోగి సర్కారు నెరవేర్చలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రామచంద్రసింగ్ తెలిపారు. ఐదు నెలల నుంచి చెరుకు మిల్లు క్రషింగ్ నిలిపేసిందని, బకాయిలు ఇంత వరకు చెల్లించలేదని చెప్పారు. వర్షాల వల్ల వరి, బంగాళాదుంప, చెరుకు పంటలు దెబ్బతిన్నాయని, అయినా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రైతులందరం కలిసి ఉత్తరాలు కూడా రాశామని చెప్పారు. తమ బకాయిలు ఇవ్వకుండానే చెరుకు మిల్లును మూసేశారని, 200 మంది కార్మికులకు కనీసం నోటీసు లేకుండా ఉద్యోగం లోంచి తీసేశారని సింగ్ చెప్పారు. నిరసనలో పాల్గొన్న చెరుకు రైతు రాజేశ్‌సింగ్ మాట్లాడుతూ.. యోగి సర్కారు రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డాడు.