కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 8 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల కోసం కామ్రేడ్ సోనూ లేఖ ద్వారా చేసిన ప్రతిపాదన సమంజసమేనని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో లేఖ విడుదల చేశారు. తమ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అమరుడైన బసవరాజు అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల ప్రతిపాదనలు, ఆ తర్వాత సోనూ అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రతిపాదనలు గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం పోలీస్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. మారిన మెజార్టీ అభిప్రాయాలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనికి తమవైపు నుంచి సైతం ఆయుధాలను త్యజించి ప్రతినిధులను శాంతి చర్చలకు పంపించేందుకు ప్రక్రియను ప్రారంభిస్తామని లేఖలో పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లా మాడ్ డివిజన్, ఉత్తర బ్యూరో, కుతుల్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రాబిన్సన్ గురియా తెలిపారు. లొంగిపోయిన వారిలో 1వ నంబర్ మిలటరీ ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ పొడియం మర్కమ్ అలియాస్ ఫగను, అదే ప్లాటూన్ సభ్యులు మనోజ్ అలియాస్ శంకర్ అలియాస్ భరత్, సుమిత్ర అలియాస్ సన్నీ కుర్సం, వనిల ఫర్స, డివిజనల్ కమిటీ సభ్యుడు శ్రీగౌడే అలియాస్ దివాకర్ (టెక్నికల్ టీమ్) ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.38 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.