న్యూఢిల్లీ: దేశంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులపై ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్లో తమిళనాడు ఎంపీ మహేశ్వరన్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. సిట్టింగ్ జడ్జీలపై గత పదేండ్లలో ఫిర్యాదులు 51 శాతం పెరిగినట్టు శుక్రవారం న్యాయ శాఖ వెల్లడించింది.
సిట్టింగ్ జడ్జిలపై 2016లో భారత ప్రధాన న్యాయమూర్తికి 729 ఫిర్యాదులు రాగా, 2025లో వాటి సంఖ్య 1,102కు పెరిగిందని తెలిపింది. న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను అంతర్గత యంత్రాంగం ద్వారా విచారించినట్టు తెలిపింది. ఈ సందర్భంగా సీజేఐకు ఎంతమంది న్యాయమూర్తులపై ఫిర్యాదులు అందిన విషయాన్ని మాత్రమే సభాముఖంగా తెలిపారు. ‘సీపీగ్రామ్’ ద్వారా ఫిర్యాదులు ఎక్కువగా అందినట్టు వెల్లడించింది.