న్యూఢిల్లీ, మే 4: దేశ చరిత్రలో 50 ఏండ్ల తరువాత మొదటిసారి కమ్యూనిస్టులు పరిపాలనలో లేకుండా పోయారు. వారి చివరి కోట కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం పొందింది. 1977 తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోవడం ఇదే మొదటిసారి.
ఒకప్పుడు దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన ఎర్ర సోదరులు నేడు అక్కడక్కడా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), వంటి పార్టీలు సంస్థాగతంగా తమ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ జాతీయస్థాయిలో వాటి ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. 1980 దశకంలో సీపీఎం నేతృత్వంలో వామపక్ష పార్టీలు కేరళ, త్రిపురతోపాటు పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్నాయి. లోక్సభకు 2004లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించారు.
దేశంలోని ఒక రాష్ట్రంలో నిరంతరాయంగా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నది సీపీఎం పార్టీ ఒక్కటే. పశ్చిమ బెంగాల్లో నిరాటంకంగా 34 ఏండ్లపాటు 1977 నుంచి 2011 వరకు ఆ పార్టీ అధికారంలో కొనసాగింది. దివంగత జ్యోతిబసు 1977 నుంచి 2000 సంవత్సరం వరకు 23 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత బుద్ధదేవ్ భట్టాచార్య అధికార పగ్గాలు అందుకున్నారు. ఆయన నేతృత్వంలో 11 ఏండ్లు సాగిన కమ్యూనిస్టుల పాలన మమతా బెనర్జీ ప్రవేశంతో కుప్పకూలింది. ఆ తరువాత మరెన్నడూ బెంగాల్లో కమ్యూనిస్టులు తమ ప్రభావం చూపలేకపోయారు.
బెంగాల్ తరువాత త్రిపురలో సైతం వామపక్షాలు సుదీర్ఘకాలం పాలన సాగించాయి. 1993 నుంచి 2018 వరకు 25 ఏండ్లపాటు అధికారంలో ఉన్నారు. 1993లో మొదటిసారి 60 సీట్లకుగాను 44 సీట్లు గెలిచి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 20 ఏండ్లపాటు మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ వీరి ఆధిపత్యానికి గండికొట్టింది.
కేరళలో ప్రతి ఐదేండ్లకోసారి అధికారం చేతులు మారడం పరిపాటి. కానీ ఐదేండ్ల క్రితం వరుసగా రెండోసారి గెలుపొందిన ఎర్ర పార్టీలు చరిత్రను తిరగరాస్తూ వరుసగా పదేండ్లు అధికారంలో కొనసాగాయి. కానీసారి వారి ఆధిపత్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గండి కొట్టింది.
దీంతో 1977 తరువాత మొదటిసారిగా దేశంలో కమ్యూనిస్టు సీఎం లేకుండా పోయారు. 1951-52లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రతిపక్షంగా నిలిచింది. ఆ తరువాత ఐదేండ్లకు 1957లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాయి. ప్రపంచంలోనే ప్రజాస్వామికంగా ఎన్నికల ద్వారా ఓ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడటం అదే మొదటిసారి.