అహ్మదాబాద్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్‌లోని మాధాపూర్‌లో పాల వ్యాపారం నిర్వహించే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దీంతో అతని మరణానికి పలానా వర్గం వారేనని.. వారికి సంబంధించిన మసీదుపై మరో మర్గం వారు దాడికిదిగారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు దాని సమీపంలో ఉన్న షాపులపై దాడిచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రెండు వర్గాలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో అల్లరు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ నేడు అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధిపనులను ప్రారంభించనున్నారు. సబర్మతి నదిపై నిర్మించిన పాదచారుల వంతెనను ఆరంభించారు. దానికి అటల్ బ్రిడ్జిగా నామకరణం చేశారు.