న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి త్వరలో కొందరు సభ్యులతో ఒక కమిటీని వేయనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం తెలిపింది. రైతులకు సంబంధించిన తాత్కాలిక సమస్యలను ఈ కమిటీకి తెలియజేయాలని పంజాబ్, హర్యానా రాష్ర్టాలను ఆదేశించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
తమ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 13 నుంచి ఆందోళన చేస్తున్న రైతులను కలిసి హైవేపై నిలిపి ఉంచిన ట్రాక్టర్లు, ట్రాలీలను తొలగించేందుకు ఒప్పించాలని పంజాబ్, హర్యానా రాష్ర్టాలకు సూచించింది. రైతుల నిరసనలను నిరోధించడానికి శంభు సరిహద్దు వద్ద అంబాలలో హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.