Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ముంబైలో ఉండే ధారావి మురికివాడ రూపురేఖలను మార్చడానికంటూ తీసుకొచ్చిన ‘ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్’ పనుల్లో మరో కీలక అడుగు పడింది. టెండర్‌ను చేజిక్కించుకొన్న అదానీ గ్రూప్ ముంబై మురికివాడల పునరావాస అథారిటీతో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌గా నామకరణం చేసింది. అయితే, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు హిండెన్‌బర్గ్, ఓసీసీఆర్పీ నివేదికలు ఆరోపించిన నేపథ్యంలో ధారావి ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.10 లక్షల కోట్ల విలువైన భూమి కోసమే అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును అడ్డదారుల్లో చేజిక్కించుకొన్నట్టు పలువురు విమర్శిస్తున్నారు.
17 ఏండ్ల సుదీర్ఘ ప్రాజెక్టు
ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిచేసింది. టెండర్లో అదానీ రియాల్టీ, డీఎల్ఎఫ్, నమన్ గ్రూప్ పోటీపడ్డాయి. ప్రభుత్వం పేర్కొన్న కనీస బిడ్ రూ.1,600 కోట్లు కాగా.. డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. అదానీ రియాల్టీ రూ.5,069 కోట్లకు టెండర్లు వేసింది. దీంతో అదానీ కంపెనీకే ప్రాజెక్టు ఖరారైంది. ఈ ప్రాజెక్టును 17 ఏండ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలిదఫాలో వచ్చే ఏడేండ్లలో ధారావి వాసులను వేరే ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది.
టెండర్ ప్రక్రియలో అనుమానాలెన్నో
ధారావి ప్రాజెక్ట్‌ను రూ.7,200 కోట్లకు యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ 2019లో దక్కించుకొన్నది. గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దు చేసింది. కొత్త టెండర్లను పిలిచి రూ.5,069 కోట్లకే అదానీ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టింది. ఆర్థిక కారణాలను సాకుగా చూపెట్టిన ప్రభుత్వం.. రూ.2 వేల కోట్ల తక్కువకు అదానీకి ధారావి ప్రాజెక్టును కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని, అదానీ సంస్థ కోసం తమ కాంట్రాక్టును రద్దు చేసిందని సెక్లింక్ కంపెనీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది.
స్థానికులను వెళ్లగొట్టే కుట్ర?
620 ఎకరాల్లో విస్తరించిన ధారావి ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ నివసిస్తున్న 12 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. వచ్చే ఏడేండ్లలో ఇండ్లు సహా ప్రజలకు ఇతర సౌకర్యాలు కల్పించాలి. ఆ దిశగా ఎలాంటి పనులు జరగనప్పటికీ.. స్థానికులను వేరే ప్రాంతాలకు వెళ్లాలంటూ నోటీసులు ఇస్తుండటం గమనార్హం. న్యూ ధారావిలో అత్యాధునిక ఇండ్లు కట్టించి ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం, అదానీ కంపెనీ ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. జనవరి 1, 2000 కంటే ముందు నుంచి ధారావిలో నివసిస్తున్నట్టు రికార్డులు చూపించినవారికే కొత్త ఇండ్లు కట్టిస్తామని మెలిక పెడుతున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గూడు లేకుండా చేసే కుట్ర
కొత్త నిబంధనలు తీసుకొచ్చి మాకు గూడు లేకుండా కుట్ర చేస్తున్నారు. అదానీ కంపెనీ ధారావిని అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం మాకు లేదు.
-రాజ్‌కుమార్ ఖందారే, ధారావి నివాసి
మోదీ దోస్తు కాబట్టే..
అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు. మహారాష్ట్రలో బీజేపీదే అధికారం. అందుకే ధారావి ప్రాజెక్టు అదానీకి దక్కింది.
– ప్రమీత్ పాల్, స్థానిక వ్యాపారవేత్త