Supreme Court : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) కు చెందిన బ్లాక్ క్యాట్ కమెండో (Black Cat Commando) కు సుప్రీంకోర్టు (Supreme court) లో చుక్కెదురైంది. భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడికి ఊరటనిచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాను బ్లాక్ క్యాట్ కమెండోనని, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) లో తాను పాల్గొన్నానని, కాబట్టి పోలీసుల ముందు సరెండర్ కావడం నుంచి తనకు మినహాయింపును ఇవ్వాలని కోరుతూ సదరు కమెండో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఒక కమెండోగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడం నేరాల నుంచి తప్పించుకునే శక్తులు ఇవ్వదని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులో విచారణ కోసం లొంగిపోవాలని ఆదేశించింది. దాంతో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని కమెండో తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అతడి అభ్యర్థన మేరకు కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. భార్యను గొంతు నులిమి చంపిన కేసులో కమెండో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.