శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కథువాలో కూంబింగ్ ఆపరేషన్(Kathua Combing Operation) జరుగుతున్నది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ముగ్గురు మిలిటెంట్లు.. పంజతీర్థ-బరోటా ప్రాంతంలో దాక్కున్నట్లు తేలింది. దీంతో వారి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఫైరింగ్ జరుగుతోంది. మార్చి 31వ తేదీన కథువాలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత ఇవాళ పలు భద్రతా దళాలు.. కథువా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది.
మార్చి 23వ తేదీన అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న నర్సరీలో ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. అయితే ఆ ముగ్గురూ పరారీ అయ్యారు. నాలుగు రోజుల తర్వాత కథువాలో ఉన్న సన్యాల్ బెల్ట్ వద్ద మళ్లీ ఎదురుపడ్డారు. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో నలుగురు పోలీసులతో పాటు మరో ముగ్గురు మృతిచెందారు. కథువా అడవుల్లో ఉన్న ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు తమ లొకేషన్ మారుస్తూ పరారీ అవుతున్నారు.
ఆర్మీ, పోలీసు, ఎన్ఎస్జీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. రుయి, జుథానా, ఘాటీ, సన్యాల్, బిల్లవార్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతున్నది.