న్యూఢిల్లీ: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తరహాలోనే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసిరారు. వచ్చి నన్ను అరెస్టు చేసుకో.. నీకోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్రంప్‌ను పెట్రో సవాలు చేశారు. వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి చేసి అధ్యక్షుడు మదురోను బంధించిన ఘటనపై సోమవారం ఓ ప్రకటనలో పెట్రో స్పందిస్తూ వారి(అమెరికా) వద్ద బాంబులు ఉంటే మా కొండల్లో వేలాది గెరిల్లాలు పుట్టుకొస్తారు. మా ప్రజలు ప్రేమించే, గౌరవించే వారి అధ్యక్షుడిని బంధిస్తే ఒక్కొక్కరు ఓ చిరుతలా విరుచుకుపడతారు అని హెచ్చరించారు.
వెనెజువెలాలో కాల్పులు
వెనెజువెలా అధ్యక్షుడి భవనం సమీపంలో సోమవారం రాత్రి కాల్పులు వినిపించినట్లు సాక్షులు తెలిపారు. అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అమెరికా సైన్యం నిర్బంధించిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.