లక్నో: కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది. (woman plots student’s murder) మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి తెలిసిన వారితో చంపేందుకు ప్రయత్నించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల ధీరజ్, బీకామ్ చదువుతున్నాడు. ఆరు నెలల కిందట సోషల్ మీడియా ద్వారా ప్రియ అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నోయిడాకు వచ్చిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ధీరజ్‌ను అడిగింది. ఇంకా చదువు పూర్తికాని అతడు పెళ్లికి నిరాకరించాడు.
కాగా, కలత చెందిన ప్రియ, ధీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసింది. డిసెంబర్ 24న అతడ్ని ఆమె పిలిపించింది. కారులో ఉన్న ధీరజ్‌కు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. తన స్నేహితులకు ఫోన్ చేసి అతడ్ని చంపాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు కారులో అచేతనంగా ఉన్న ధీరజ్‌ను కొందరు వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ధీరజ్ తండ్రి ఫిర్యాదుతో ప్రియ, ఆమె స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులైన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.