PSU General Insurers | ముంబై, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ బీమా సంస్థల మార్కెట్ వాటా మొట్టమొదటిసారిగా మూడో వంతు కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో ప్రైవేట్ నాన్ లైఫ్ ఇన్సూరర్స్ తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నాయి. దీంతో ప్రీమియం ఆదాయంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థల వాటా 32.5 శాతానికి పరిమితమైంది. వీటి ఆదాయం 1 శాతం తగ్గి, రూ.34,203 కోట్లకు పడిపోయింది. ఫలితంగా వీటి మార్కెట్ షేర్ 33.4 శాతం నుంచి 32.5 శాతానికి తగ్గిపోయింది.
ప్రీమియం ఆదాయం కూడా రూ.37,100 కోట్ల నుంచి రూ.34,203 కోట్లకు తగ్గింది. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటా ఈ వివరాలను వెల్లడించింది. మరోవైపు, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్స్ మార్కెట్ షేర్ డబుల్ డిజిట్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి. ఇది 9.2 శాతం నుంచి 10.4 శాతానికి పెరిగింది. సెగ్మెంట్లవారీగా సమాచారం ఇంకా రావలసి ఉన్నప్పటికీ, హెల్త్ ఇన్సూరర్స్ పెర్ఫార్మెన్స్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఆగస్టుతో ముగిసిన ఐదు నెలల్లో 11.7 శాతం వృద్ధి చెందింది.
2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో ప్రీమియం ఇన్కమ్ రూ.1.02 లక్షల కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.1.14 లక్షల కోట్లకు పెరిగింది.మన దేశంలో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు 26 ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి.