లక్నో: ఒక కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) పైకప్పు కూలింది. ఈ సంఘటనలో 8 మంది మరణించారు. మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌసిలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్ స్లాబ్ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సుమారు పది మంది వ్యక్తులను కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, కూలిన కోల్డ్ స్టోరేజ్ స్లాబ్ శిథిలాల కింద సుమారు 20 మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో రెస్క్యూ, రిలీఫ్ చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాలను తొలగిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తెలుస్తున్నది.
మరోవైపు కూలిన కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా వ్యవసాయ ఉత్పత్తులతో నిండి ఉంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సోర్టేజ్ పైకప్పు కూలినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీ యజమానులైన అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: