న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌరులు చనిపోయారన్న పాకిస్థాన్ ఆరోపణలను ఆయన ఖండించారు. భారత సైనిక దాడుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు హాజరైన చిత్రాన్ని విక్రమ్ మిస్రీ ప్రదర్శించారు. శవపేటికలపై పాకిస్థాన్ జెండాలు కప్పి ప్రభుత్వ లాంఛనాలతో పౌరులకు అంత్యక్రియలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
కాగా, మే 7న భారత్ జరిపిన సైనిక దాడులన్నీ జాగ్రత్తగా ఎంచుకున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఉగ్రవాద లక్ష్యాలపైనే అని విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ‘ఈ దాడుల్లో ఎవరైనా పౌరులు చనిపోతే, ఈ చిత్రం మీ అందరికీ ఎలాంటి సందేశాన్ని పంపుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది అడగాల్సిన ప్రశ్న. పౌరుల అంత్యక్రియల్లో శవపేటికలపై పాకిస్థాన్ జెండాలు కప్పి, ప్రభుత్వ గౌరవం ఇవ్వడం కూడా వింతగా ఉంది. హతమైన వ్యక్తులు ఉగ్రవాదులే. అలాంటి ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు బహుశా పాకిస్థాన్లో ఒక ఆచారం కావచ్చు. ఇది మాకు పెద్దగా అర్థం కాలేదు’ అని అన్నారు. అలాగే మతపరమైన ప్రదేశాలపై భారత్ దాడి చేసిందన్న పాకిస్థాన్ ఆరోపణలను కూడా విక్రమ్ మిస్రి ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని అన్నారు.