Coffee Price | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: రోజూ ఇంత కాఫీ నోట్లో పడందే చాలామందికి తెల్లవారదు. ఆ కాఫీ ధర త్వరలో చేదు రుచిని కలిగించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కాఫీ పౌడర్ కిలో రూ.1000 ఉండగా, స్థానిక మార్కెట్లలో 15 నుంచి 30 శాతం వరకు ధర పెంచి అమ్ముతున్నారు. ముఖ్యంగా కాఫీ గింజలను అధికంగా సాగుచేసే కర్ణాటకలో ధర భారీగా పెరిగినట్టు తెలుస్తున్నది.
కాఫీ ఉత్పత్తి దేశాలైన బ్రెజిల్, వియత్నాంలో పంట నష్టం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని, ఆ ప్రభావం భారత్‌పై కూడా పడిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో దాదాపు 70 శాతం కాఫీ గింజలు కర్ణాటలో ఉత్పత్తి అవుతాయి. ఆ రాష్ట్రంలో అరబికా, రోబస్టా రకాలను సాగుచేస్తారు. ఎరువులు, కూలీల రేట్ల వంటి పెట్టుబడి వ్యయం పెరగటం వల్లనే పంట ధరను పెంచినట్టు రైతులు తెలిపారు. ఇక డిమాండ్‌కు సరఫరాకు మధ్య ఉన్న భారీ తేడా కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని అన్నారు.