న్యూఢిల్లీ : జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. కేంద్ర విద్యా శాఖ కార్యాలయం బయట జరిగిన ఈ ధర్నాలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ), క్రాంతికారి యువ సంఘటన్(కేవైఎస్) పాల్గొన్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీకి, మార్కుల గణనలో తప్పులకు, పరీక్షల సంబంధిత అంతరాయాలకు ప్రధాన్ జవాబుదారీ వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
తమ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకొన్నారని వారు ఆరోపించారు. ఏఐఎస్ఐ జాతీయ అధ్యక్షురాలు నేహ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో నిర్లక్ష్యానికి, అవినీతికి ఎన్టీఏ సంకేతంగా మారిందని విమర్శించారు. పరీక్షల్లో అవకతవకలను నిరోధించడానికి బదులు విద్యార్థుల నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఏఐఎస్ఐ ఢిల్లీ యూనివర్సిటీ కార్యదర్శి అంజలి ఆరోపించారు. విద్యా వ్యాపారీకరణ పెరిగిన నేపథ్యంలో పరీక్షల కుంభకోణాలు, కోచింగ్ పరిశ్రమల ప్రభావంపై సమగ్ర విచారణ చేయాలని కేవైఎస్ డిమాండ్ చేసింది.