రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెగ్రాపల్లి వద్ద జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ కోబ్రా దళానికి చెందిన నిరంజన్ కుమార్ పాశ్వాన్ అనే కమాండో తీవ్రంగా గాయపడ్డారు. పెగ్రాపల్లిలోని బద్గిచెరు అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
గాయపడిన జవాన్‌ను దవాఖానకు తరలించామని, అతని ఎడమ కాలుకు గాయాలయ్యాయని చెప్పారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయని తెలిపారు.