Coast Guard DG | ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్.. ‘సమర్థవంతమైన, నిబద్ధత గల అధికారి’ అని పేర్కొన్నారు. ‘ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన సమర్ధవంతమైన, నిబద్ధత గల అదికారి. ఆయన సారధ్యంలో భారత్ మారిటైం సెక్యూరిటీ బలోపేతం అయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’ అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
గతేడాది జూలై 19న ఐసీజీ 25వ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ పాల్ బాధ్యతలు చేపట్టారు. ఐసీజీ ఈవెంట్లో రక్షణ మంత్రిని ఆయన కలువాల్సి ఉంది. కానీ అనారోగ్యంతో రాజీవ్ గాంధీ జనరల్ దవాఖానలో చేరారని ఐసీజీ అధికారులు తెలిపారు. డీఎంకే నేత ఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన ‘సంస్మరణ నాణెం’ ఆవిష్కరణ కార్యక్రమం కోసం రాజ్ నాథ్ సింగ్ ఆదివారం చెన్నైకి వచ్చారు. రాకేశ్ పాల్ దుర్మరణం వార్త తెలియగానే నివాళులర్పించేందుకు హుటాహుటిన రాజ్ నాథ్.. దవాఖానకు వెళ్లారు.