న్యూఢిల్లీ, మే 19: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం వెల్లడించింది. గోయల్ యూకో బ్యాంక్ సీఎండీగా ఉన్నప్పుడు కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (సీఎస్పీఎల్) కంపెనీకి భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు అరోపణలు వచ్చాయి. ఇలా మంజూరైన రుణాల్లో రూ.6,210.72 కోట్లను సీఎస్పీఎల్ కంపెనీ దుర్వినియోగం చేసినట్టు ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
గోయల్, అతని కుటుంబ సభ్యుల నియంత్రణలోని షెల్, డమ్మీ కంపెనీలకు నిధులను మళ్లించినట్టు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు గత ఏప్రిల్‌లో గోయల్‌తోపాటు పలువురు ఇండ్లలో దాడులు నిర్వహించారు. ఈ నెల 16న గోయల్‌ను అరెస్టు చేసి, స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఈ నెల 21 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. సీఎస్పీఎల్కు రుణాల మంజూరు వ్యవహారంలో గోయల్‌కు భారీ మొత్తంలో లబ్ధి చేకూరినట్టు ఈడీ పేర్కొన్నది. నగదు, స్థిరాస్థులు, విలాస వస్తువులు, హోటల్ బుకింగ్ తదితర రూపాల్లో షెల్ కంపెనీల ద్వారా గోయల్‌కు లబ్ధి చేకూరినట్టు వివరించింది.