ముంబై, ఏప్రిల్ 6: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ), ప్రతిపక్ష బీజేపీ మధ్య పోరు తారస్థాయికి చేరింది. కేంద్రప్రభుత్వం తన ఆధీనంలోని ఈడీ, సీబీఐ, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు తదితర సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న వేళ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యూహం మార్చారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అక్రమాలను తవ్వి ప్రతిపక్ష నేతలను కటకటాల్లో తోసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నువ్వు ఒక్క రాయి విసిరితే నేను పది విసురుతా అన్న రేంజ్లో రాజకీయం సాగుతుండటం ఆసక్తిగా మారింది.
కేంద్ర సంస్థల ముప్పేట దాడి
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటినుంచీ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ ఇప్పటికే ఉద్ధవ్ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను జైలుకు పంపింది. మొదట అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసిన ఈడీ, ఆ తర్వాత నవాబ్ మాలిక్‌ను కూడా జైల్లో వేసింది. నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపించింది. వాటిని ఇప్పటివరకూ నిరూపించలేదు. తాజాగా శివసేన ఫైర్‌బ్రాండ్, ఎంపీ సంజయ్‌రౌత్‌పై దృష్టిపెట్టింది. పదేండ్లనాటి ఓ కుంభకోణం కేసులో రౌత్ ఆస్తులను రెండురోజుల క్రితం జప్తు చేసింది. ఈ ముగ్గురు నేతలు బీజేపీని మొదటినుంచీ తీవ్రంగా విమర్శిస్తున్నవారే. అంతటితో ఆగకుండా సీఎం ఠాక్రేకు అత్యంత సన్నిహితుడి ఇండ్లపై కూడా ఈడీ దాడులు చేసింది.
ఉద్ధవ్ ఎదురుదాడి
కేంద్ర సంస్థల దూకుడును మొదట అంతగా పట్టించుకోని సీఎం ఉద్ధవ్, తాజాగా అంతేస్థాయిలో ఎదురుదాడి మొదలుపెట్టారు. మాజీ సీఎం, బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు రాష్ట్రంలోని బీజేపీ కీలక నేతలే లక్ష్యంగా అవినీతి పుట్టలను తవ్వుతున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన జల్యుక్త శివర్ యోజన (వాటర్‌షెడ్) పథకంలో అవినీతిపై ఫోకస్ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఫడ్నవీస్ మెడకు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నది.
ఫడ్నవీస్ సన్నిహిత బీజేపీ నేతలు కిరీట్ సోమయ్య, ప్రవీణ్ డరేకర్, మోహిత్ కంబోజ్, నారాయణ్ రాణేపై కూడా ఠాక్రే దృష్టి పెట్టారు.
పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ వాధావన్తో కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీట్ సోమయ్యకు సన్నిహిత సంబంధాలున్నాయని సంజయ్ రౌత్ ఆధారాలు బయటపెట్టారు.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారం వెనుక ఉన్నది మోహిత్ కాంబోజ్ అని నవాబ్ మాలిక్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
దిశా సాలియన్ మృతి కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణే, ఆయన కుమారుడు నితేశ్ రాణేను మాల్వానీ పోలీసులు ఏకంగా తొమ్మిది గంటలపాటు విచారించటం ద్వారా బీజేపీకి ఠాక్రే గట్టి హెచ్చరికలు పంపారు.
బీజేపీలో చేరగానే సచ్చీలురు!
మహారాష్ట్ర విధాన పరిషత్‌తో ప్రతిపక్ష నేత ప్రవీణ్ డరేకర్పై ఠాక్రే ప్రభుత్వం ముప్పేట దాడి మొదలుపెట్టింది. తప్పుడు మార్గంలో ఆయన ముంబై బ్యాంకు డైరెక్టర్, అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేసి గెలిచారని, ఆయన హయాంలోనే కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
డరేకర్ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనలో ఉన్నప్పుడు ఆయన ముంబై బ్యాంకులో రూ.200కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. 2016లో ఆయన బీజేపీలో చేరి విధాన సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఆ కుంభకోణాన్ని మర్చిపోయింది.
నారాయణ్ రాణే ఏడు కంపెనీల్లో వందలకోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేత కిరీట్ సోమయ్య 2017లో అనేక పత్రాలు బయటపెట్టారు. దీనిపై ఈడీ దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. రాణే 2019లో బీజేపీలో చేరిన తర్వాత ఆ విషయాన్ని ఈడీతోపాటు సోమయ్య కూడా మర్చిపోయారు.
ఉత్తర భారతానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కృపాశంకర్ సింగ్ ముంబైలో రూ.300 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని కిరీట్ సోమయ్య ఆరోపించారు. ఈ అవినీతిపై సింగ్‌పై కేసు కూడా నమోదైంది. 2016లో ఫడ్నవీస్ ప్రభుత్వం హయాంలో అనూహ్యంగా అన్ని కేసుల నుంచి కృపాశంకర్ బయటపడ్డారు.