Lucknow | యూపీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కీలక మలుపు. యూపీలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే కీలక సంఘటన జరిగింది. శివసేన రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్‌తో సంప్రదింపులు ప్రారంభించింది. స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే టికాయత్‌తో మంతనాలు జరిపారు. అంతేకాకుండా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఏకంగా ముజఫర్ నగర్ వెళ్లి, రాకేశ్ టికాయత్‌తో భేటీ కూడా అయ్యారు. యూపీ ఎన్నికల సందర్భంగా సంజయ్ రౌత్ రైతు నేత టికాయత్ మద్దతు కోరినట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 సీట్లలో శివసేన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో టికాయత్‌తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అయితే తాము రైతుల గురించే మాట్లాడుకున్నామని, రాజకీయాలు ఏమాత్రం ప్రస్తావనకు రాలేదని రౌత్ పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ కూడా మహారాష్ట్ర రైతుల విషయమే టికాయత్‌తో మాట్లాడారని, యూపీ రాజకీయాలు ప్రస్తావన చేయలేదని రౌత్ అంటున్నారు. ఈ ఇద్దరు చాలా సేపు రైతుల గురించే మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. అయితే రైతు మద్దతుతోనే దేశ రాజకీయాలు నడుస్తున్నాయన్న విషయాన్ని మరిచిపోవద్దని రౌత్ మాట్లాడటం గమనించాల్సిన అంశం.
తాను త్వరలోనే మహారాష్ట్రలో పర్యటిస్తానని రైతు నేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ముఖ్యమంత్రి తనను మహారాష్ట్రకు రావాలని ఆహ్వానించారని, రైతులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామని టికాయత్ అన్నారు. అయితే తాము రాజకీయాలు చేయాలని భావించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ పార్టీల పని అని టికాయత్ పునరుద్ఘాటించారు.