Karnataka | కుల గణన నిర్వహించాలన్న నిర్ణయం తమది కాదని.. పార్టీ హైకమాండ్‌దేనని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మీడియాతో బుధవారం మాట్లాడారు. కుల గణనకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. కుల గణన జరిగి పదేళ్లు గడిచాయని.. ప్రస్తుతం అది పాతబడిపోయిందన్నారు. పార్టీ నాయకులు తక్కువ సమయంలోనే మళ్లీ కుల గణన నిర్వహించాలని సూచించారన్నారు. త్వరలోనే కుల గణన నిర్వహిస్తామని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాంతరాజ్ కమిషన్ నివేదికపై పార్టీ సీనియర్ నాయకుల నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పార్టీ సీనియర్లు నిర్ణయించిన విధంగా తాము చర్యలు తీసుకుంటామని.. ఇది తమ నిర్ణయం కాదన్నారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ నెల 10న మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కుల గణన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొన్ని వర్గాలు కుల గణన డేటాపై ప్రశ్నలు లేవనెత్తాయని.. అందుకే మళ్లీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కుల గణనను చేపట్టి.. ఇంటింటికీ, ఆన్లైన్ సర్వే నిర్వహిస్తామని డీకే శివకుమార్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ నెల 12న జరిగే మంత్రివర్గ సమావేశంలో కుల గణనపై చర్చిస్తామన్నారు. కర్నాటక ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. గత రెండు నెలలుగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల సర్వే నిర్వహిస్తుందన్నారు. కుల గణనకు చాలా సమయం పడుతుందని.. తర్వాత కేబినెట్ సమావేశంలో నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2015లో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో కుల గణన జరిగింది. కానీ, వొక్కలిగ, లింగాయత్ వర్గాల ఒత్తిడితో నివేదికను విడుదల చేయలేదు. ఈ నివేదికను మంత్రివర్గానికి సమర్పించక ముందే లీక్ అయింది. వొక్కలిగ, లింగాయత్ వర్గాల ప్రజలు సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో తమ జనాభా తగ్గిందని ఆరోపించారు.