CM Siddaramaiah | బెంగళూరు, సెప్టెంబర్ 25: ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్యపై విచారణ ప్రారంభించాలని పేర్కొన్నది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.
కాగా, ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణకు ఆగస్టు 16న గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. సిద్ధరామయ్యపై విచారణ జరపొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి ముడా కేటాయించిన 14 స్థలాల్లో అవకతవకల ఆరోపణలపై లోకాయుక్త పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.
తనపై విచారణ జరపాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తాను పోరాడతానని, దేనికీ భయపడనని పేర్కొన్నారు. విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, న్యాయపరంగానే తాను పోరాడతానని స్పష్టం చేశారు. కాగా, సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేసిన స్నేహమయి కృష్ణ మాత్రం లోకాయుక్త పోలీసుల విచారణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ ద్వారానే విచారణ జరిపించాలని, ఇందుకోసం తాము హైకోర్టునుఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేశాయి. గురువారం విధానసౌధ ముం దు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.