భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు వారంతా క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) చెప్పారు. కనిపించకుండా పోయిన బాలికలను (Missing Girls) గుర్తించామన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వసతి గృహాలపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, బాలికల అదృశ్యానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను సస్పెండ్ చేయగా, ఇద్దరికి నోటీసులు జారీ చేశారు.
భోపాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని పర్వాలియా ప్రాంతంలో ఉన్న ఆంచల్ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారన్న ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో వసతి గృహాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయినవారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వారున్నారు. వారంతా 6 నుంచి 18 సంవత్సరాల లోపు వారని, వారిలో కొందరు వీధుల్లో అనాథలుగా ఉన్నవారని పోలీసులు గుర్తించారు.