Mamata Banerjee | కోల్‌కతా, మే 3: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్ మహిళా ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పర్బా బర్దమాన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ ‘గవర్నర్ లైంగిక దాడిపై రాజ్‌భవన్ మహిళా ఉద్యోగి కన్నీటి గాథ నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను ఆమె వీడియోను చూశా.. ఆమె భాధను అర్థం చేసుకున్నా.
గురువారం రాత్రి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రధాని మోదీ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు’ అని మమత ప్రశ్నించారు. తల్లులు, చెల్లుల గౌరవం గురించి ఉపన్యాసాలు దంచే మీరు దీనిపై స్పందించరా? అని ఆమె నిలదీశారు. ‘రాజ్‌భవన్‌లో షాకింగ్ విషయాలు తెలిశాయి. మరికొంత మంది మహిళలపై కూడా ఇలాగే వేధింపులకు పాల్పడ్డారు. ‘నారీ కా సమ్మాన్’ నినాదంలో చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు వెంటనే జోక్యం చేసుకుని బాధిత మహిళలకు న్యాయం చేయాలి’ అని తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
రాజ్‌భవన్ ప్రాంగణంలోకి పోలీసులు, బెంగాల్ మంత్రి భట్టాచార్యకు ప్రవేశాన్ని నిషేధిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో గవర్నర్‌ను పోలీసులు ప్రశ్నిస్తారన్న అనుమానం, గవర్నర్‌పై ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రి భట్టాచార్య తొలిసారిగా స్పందించడం వల్ల ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్టు భావిస్తున్నారు. ‘అసలు రాజ్‌భవన్‌లో ఏం జరుగుతున్నది? అది కూడా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రోజు జరగడం ఏమిటి?’ అని భట్టాచార్య నిలదీశారు.
ఇలాంటి ఆరోపణలు తనపై ఇంకా రావచ్చునని, 1943 నాటి బెంగాల్ కరువుకు, 1846 నాటి కలకత్తా హత్యలకు కూడా తనను నిందించవచ్చునని గవర్నర్ బోస్ శుక్రవారం పేర్కొన్నారు. ఇదొక అసంబద్ధ నాటకంగా వర్ణించిన ఆయన అవినీతిని, రాష్ట్రంలో జరుగుతున్న హింసపై తాను సాగిస్తున్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.