అహ్మదాబాద్, డిసెంబర్ 30: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (99) మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. రెండురోజుల క్రితమే ఆమె అనారోగ్యంతో దవాఖానలో చేరారు.
హీరాబెన్‌కు ఐదుగురు సంతానం. నరేంద్రమోదీ, సోమాభాయ్ మోదీ, అమృత్‌భాయ్ మోదీ, ప్రహ్లాద్‌భాయ్ మోదీ, పంకజ్‌భాయ్ మోదీతోపాటు కుమార్తె వాసంతిబెన్ ఉన్నారు. హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్‌లో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించారు. అంత్యక్రియల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్‌రూపానీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హీరాబెన్ మృతికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.. ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల సంతాపం తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితో పాటుగా లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు కూడా సంతాపం ప్రకటించారు.