ముంబై, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, షిండేపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి ఉద్ధవ్ ఠాక్రే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం అధికార ప్రతినిధి నరేష్ మాస్కే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి గెలిచిన తొమ్మిది మందిలో ఇద్దరు ఎంపీలు తమను సంప్రదించారని తెలిపారు.
నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కారణంగా ఆ ఇద్దరి పేర్లు తాను బయటపెట్టబోనని తెలిపారు. ఉద్ధవ్‌కు తమపై నమ్మకం లేదని, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీకి మద్దతిస్తామని వారు తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఓ సామాజిక వర్గం వారిని ఉద్ధవ్ ఓట్లు అడిగిన తీరు ఆ ఎంపీలకు నచ్చలేదన్నారు. ఆ వర్గంవారు బస్సుల్లో పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారని చెప్పారు. నరేష్ వ్యాఖ్యలతో ఉద్ధవ్ వర్గంలో అలజడి రేగింది. ఆ ఇద్దరు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, నరేశ్ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అంధారే తోసిపుచ్చారు. నరేష్ మాసే పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.