Arvind Kejriwal | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నదని, కానీ.. నవంబర్‌లో మహారాష్ట్రతో పాటే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన రాజీనామా ప్రకటన చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ‘నిర్దోషులుగా నిరూపించుకొనేవరకు నేను సీఎంగా, మనీశ్ సిసోడియా డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోం.
కొత్త సీఎం ఎంపికపై రెండు, మూడు రోజుల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆప్‌లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బీజేపీ కుట్రలు చేసింది. పార్టీని ముక్కలు చేసేందుకు నన్ను జైలుకు కూడా పంపారు. కానీ, ఎన్ని ఎత్తులు వేసినా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయింది. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాజ్యాంగాన్ని కాపాడేందుకు నేను ఇన్ని రోజులు రాజీనామా చేయలేదు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడిపించకూడదు అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. నాకు బీజేపీ ముఖ్యం కాదు. ప్రజలే ముఖ్యం’ అని వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతానని, తాను నిర్దోషిని అని నమ్మితే ప్రజలు ఓట్లు వేసి ఆప్‌ను గెలిపించాలని కోరారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని స్పష్టంచేశారు.
‘ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే మాతో ఉండి ముందుకు నడిపించాడు. దేవుడిచ్చిన ధైర్యంతో ప్రత్యర్థులతో పోరాడాం. మన నాయకులు సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నా’ అని కేజ్రీవాల్ తెలిపారు. ‘బీజేపీయేతర సీఎంను గద్దె దించేందుకు వాళ్లు కొత్త ఆటలు ఆడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సీఎంలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీపై కేసులు నమోదు చేసినా రాజీనామా చేయొద్దు’ అని విన్నవించారు.
ఆప్ నేతలపై అక్రమ కేసులు బనాయించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆప్ భావిస్తున్నది. తద్వారా ప్రజల సానుభూతి పొందాలని యోచిస్తున్నది. ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళితే ఆప్ నేతల అరెస్టు ప్రభావం పెద్దగా కనిపించదని భావించే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేజ్రీవాల్ యోచిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
కేజ్రీవాల్ తన భార్య సునీతను సీఎం చేసేందుకు ఈ ప్లాన్ వేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా మాట్లాడుతూ.. కేజ్రీవాల్వి పీఆర్ స్టంట్లు అని, ఎమోషనల్ కార్డును వాడుతున్నారని విమర్శించారు. ‘సీఎం హోదాలో ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాబట్టే ఆయన రాజీనామా కార్డును వాడుతున్నారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ అవినీతి అర్థమైంది. కేజ్రీవాల్ సోనియాను ఫాలో అవుతున్నారు. అప్పట్లో మన్మోహన్సింగ్ను ముందుంచి.. తెరవెనుక సోనియా నడిపించారు. అదేవిధంగా, తనకు ఓటు వేయరని తెలిసి కేజ్రీవాల్ రాజీనామా నాటకం ఆడుతున్నారు’ అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఆరోపించారు.