Yoga | న్యూఢిల్లీ: నిద్ర లేమితో బాధపడేవారికి యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ క్లినికల్ ట్రయల్స్ వెల్లడించాయి. చండీగఢ్‌లోని పీజీఐ సహకారంతో ఈ ప్రయోగాలు జరిగాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ సత్బిర్ సింగ్ ఖల్సా, పీజీఐకి చెందిన ప్రొఫెసర్ అక్షయ్ ఆనంద్ కలిసి ఈ అధ్యయనాలను నిర్వహించారు.
డాక్టర్ ఖల్సా మాట్లాడుతూ, నిద్రపోయే సమయం విషయంలో యోగాసనాలు ప్రయోజనకరంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నిద్ర నాణ్యత, గాఢత వంటి వాటికి కూడా యోగా దోహదపడుతున్నట్లు తెలిసిందన్నారు. ఉద్రేకాన్ని తగ్గించడంలో యోగా సమర్థంగా పని చేస్తుందన్నారు. నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్నవారి చేత తేలికపాటి యోగాసనాలను చేయించి, వారి పరిస్థితిని పరిశీలించినట్లు డాక్టర్ ఖల్సా చెప్పారు. ఈ అభ్యాసం తర్వాత వారిలో చెప్పుకోదగ్గ మంచి మార్పులు కనిపించాయన్నారు.
గాఢ నిద్ర, మొత్తం నిద్ర సమయం, మేలుకుని ఉండే సమయం, నిద్ర పట్టడానికి పట్టే సమయం (10-20 నిమిషాలు), నిద్రపోయిన తర్వాత మేలుకునే సమయం, మధ్య మధ్యలో మేలుకోవడం, నిద్ర నాణ్యత వంటివి వీరిలో మెరుగుపడినట్లు తెలిపారు. మందులు చేయలేని పనులను యోగా చేస్తుందని, నిద్రలేమికి నిద్ర మాత్ర కన్నా యోగా మెరుగైనదని స్పష్టం చేశారు.