Jharkhand clash | జార్ఖండ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఓ వైపు నుంచి వచ్చిన మంటలు మసీదు వద్ద ఉన్న దుకాణాలకు అంటుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. మహాశివరాత్రి సందర్భంగా తోరణం ఏర్పాటు చేసే విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది.
జార్ఖండ్‌లోని పాలమూడి పంకీ మార్కెట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారుం. పంకీ మార్కెట్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంకీ మార్కెట్‌ను పూర్తిగా మూసి ఉంచారు. శివరాత్రి పండగ ఆర్చ్ నిర్మిస్తుండగా ఓ వర్గం వారు అడ్డుకోగా పనులు మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. పెట్రోలుతో దాడి చేయడంతో మసీదు బయట ఉన్న దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, పెట్రోల్ బాంబును పోలీసులు ధ్రువీకరించలేదు.
ఎస్పీ చందన్ కుమార్ సిన్హా, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మూడు, నాలుగు పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించారు. పంకీ మార్కెట్ ప్రాంతమంతా పోలీసు క్యాంపుగా మారిపోయింది. మహాశివరాత్రికి తోరణ ద్వారం నిర్మిస్తుండగా ఘర్షణ తలెత్తిందని ఎస్పీ చందన్ కుమార్ సిన్హా తెలిపారు. ఇరువర్గాలను శాంతింపజేశామని, పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉన్నదని ఎస్పీ చెప్పారు. ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నది.