న్యూఢిల్లీ: ఈనెల 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజున నిరసన ర్యాలీ చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు సీజేపీ శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. రకరకాల ఎంట్రెన్స్ పరీక్షలు లీక్ కావడం, నిర్వహణ లోపాన్ని ప్రశ్నిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. మరో వైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వైదొలగాలంటూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకున్నది.
అయితే పార్లమెంట్ వద్దకు నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు సమస్యలను పార్లమెంట్ పట్టించుకోవాలని, బాధ్యతతో స్పందించాలని కోరారు. సీజేపీ ప్రతినిధి విజేత దహియా మాట్లాడుతూ.. నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా గురించి కేంద్రం పట్టించుకవడంలేదని, మా విన్నపాలను మరింత స్పష్టంగా తెలియజేసేందుకు పార్లమెంట్‌కు వెళ్దామనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ నేను సజీవంగా ఉండాలని భావిస్తే, అప్పుడు మీరు మీ ఇండ్ల నుంచి మెసేజ్‌లు చేయరాదు అని, ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టాలని వాంగ్‌చుక్ కోరారు. పరీక్షల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల స్మృతికి నివాళిగా ర్యాలీ నిర్వహించనున్నట్లు సీజేపీ పార్టీ చెప్పింది.