(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కేసులకు సంబంధించి న్యాయమూర్తులపై పడుతున్న ఒత్తిడిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఒకింత భావోద్వేగానికి గురైన సీజేఐ.. ఒక్కరోజు తమ స్థానంలో కూర్చుంటే ఆ ఒత్తిడేంటో తెలుస్తుందంటూ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిటిషన్పై ముందుగా విచారణ చేపట్టాలన్న ఓ అభ్యర్థనపై ఈ మేరకు మంగళవారం సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుతున్నారు. అయితే, న్యాయమూర్తుల మీద ఉన్న పని ఒత్తిడిని ఎవరైనా పట్టించుకొంటున్నారా? మీరు (న్యాయవాదులు) ఒక రోజు జడ్జీల స్థానంలో కూర్చుంటే.. మేం ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నామో అప్పుడు అర్థమవుతుంది. మీరు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు? దయచేసి వచ్చి కూర్చోండి. మీ పిటిషన్లను ఎప్పుడు విచారించాలి అనేది కూడా మీరే నిర్ణయించండి. మీరు ఒక్కసారి మా స్థానంలో కూర్చొని చూడండి.. జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇక్కడ కూర్చోవాలనుకోరు. ఇది నేను కచ్చితంగా చెప్తున్నాను. అయినా.. మీ ప్రవర్తన మీకైనా అతిగా అనిపించట్లేదా? మేము ప్రతిఒక్క పిటిషన్పై విచారణ జరుపుతాం. దానికి ఒక తేదీని కూడా నిర్ణయిస్తాం. కోర్టులు, న్యాయమూర్తులపై ఉన్న పని ఒత్తిడిని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అంతేగానీ, మమ్మల్ని దయచేసి శాసించొద్ద్దు’ అని సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేందుకు స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ శివసేన (యూబీటీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని విచారణ మంగళవారం బెంచీ ముందుకు వచ్చింది. అయితే, మిగతా పిటిషన్ల విచారణ ఆలస్యం అవుతుండటంతో.. దీనిపై జోక్యం చేసుకొన్న శివసేన (యూబీటీ) తరుఫు న్యాయవాదులు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని ధర్మాసనానికి అభ్యర్థించారు. అయితే, దీనికి సంబంధించిన పత్రాలు అందించేందుకు సమయం కావాలని ప్రతివాదులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో పిటిషన్ను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. అయితే, ఈ వాయిదాపై పిటిషనర్ తరఫు న్యాయవాద బృందం అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతకంటే ముందుగానే పిటిషన్ను విచారించాలని కోర్టును కోరింది. దీంతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనంతో పై వ్యాఖ్యలు చేశారు.