న్యూఢిల్లీ, అక్టోబర్ 19: సుప్రీంకోర్టు ప్రజాకోర్టుగా ఉండాలని, దానిని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ అన్నారు. అయితే దానర్థం పార్లమెంట్లో ప్రతిపక్షం పాత్రను సుప్రీంకోర్టు పోషించాలని కాదన్నారు. శనివారం దక్షిణ గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు లోపాలపై ఎవరైనా విమర్శలు చేయవచ్చునని, అయితే కేవలం ఫలితాల కోణం నుంచి సుప్రీంకోర్టు పనితనాన్ని చూడలేరని అన్నారు. ‘సుప్రీంకోర్టు నుంచి న్యాయాన్ని పొందటమన్నది గత 75 ఏండ్లుగా అభివృద్ధి చెందుతున్నది. ఈ పంథాను వీడరాదు.’ అని సీజేఐ అన్నారు.
ఒక పిల్ విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ‘ఇదేమీ అమెరికా సుప్రీం కోర్టు కాదు’ అంటూ వ్యాఖ్యానిస్తూ దానిని కొట్టివేసింది.
సుప్రీం కోర్టు సహా దేశంలోని అన్ని న్యాయస్థానాల్లోని కేసులను 12 నుంచి 36 నెలల కాలపరిమితిలో పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘ఇది పూర్తిగా వాంచితమే.. అదే సమయంలో ఆచరణ సాధ్యం కూడా కాదు’ అని సీజేఐ పేర్కొన్నారు. దీనిని సాధ్యం చేయాలంటే మౌలిక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు జడ్జీల సంఖ్యను పెంచాలని అన్నారు.