న్యూఢిల్లీ: విచారణ సమయంలో ‘యా యా’ అనే పదాలను ఉపయోగించిన న్యాయవాదిపై సీజేఐ చంద్రచూడ్ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీజేఐగా పని చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ని ప్రతివాదిగా చేర్చి ఓ పిటిషన్‌ను ఆ న్యాయవాది దాఖలు చేశారు. తన పిటిషన్‌ను జస్టిస్ గొగోయ్ తప్పుడు పద్ధతిలో డిస్మిస్ చేశారని ఆరోపించారు. ఆయనపై ఇన్-హౌస్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చుతూ పిల్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆ న్యాయవాది స్పందిస్తూ, ‘యా యా, అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. నన్ను క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయమన్నారు’ అని చెప్పారు. ‘యా యా యా అనొద్దు. ‘యెస్’ అనండి. ఇది కాఫీ దుకాణం కాదు’ అని సీజేఐ అన్నారు.
దళిత విద్యార్థికి సుప్రీం అండ
న్యూఢిల్లీ: గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి సుప్రీంకోర్టు అండగా నిలిచింది. ఆ విద్యార్థిని బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేర్చుకోవాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది. యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా, టిటోరా గ్రామస్థుడు అతుల్ కుమార్ (18) జూన్ 24 నాటికి రూ.17,500 యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఆయన తండ్రి రోజువారీ వేతన ఉద్యోగి కావడంతో ఆ ఫీజును చెల్లించలేక సీటును కోల్పోయాడు. మద్రాస్ హైకోర్టు సలహా మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.